అక్షర రథం

Poetry

భువన విజయం Bhuvana Vijayam

తన సాంగత్యము నందు గల్గు సుఖ సంతోషావళుల్ నా మదిన్,
కనలేకుంటిని నేడు నేను, ఇక దైన్యంబందు లోలోతులన్,
మునిగే తీరును చూడుడింక, ఘన రాముండే గతిన్ తప్పె, మో
హన సీతా సతి రామచందురిని మాయన్ బాపు రాతున్నదా ?

ప్రేమా ఎంతటి ముప్పు తెచ్చితివె ? నా ప్రాణంబు అల్లాడగా,
రామానందము సీత కాదె? మరి దారేదీ తనన్ చేరగా?,
ఈ మాయన్ నను ముంచుటేమి సరదా ఈ కాల చక్రంబుకున్,
భామా రత్నము నన్ను చేరుటది నా భాగ్యాన రాతున్నదా?

నీలపు పుష్పరాశి జడనందున నుండగ చేతి వేళ్ళతో
లీలగ ఆటలాడ, కురులందున పువ్వులు జారి రాలగా,
కాలము మారిపోయినది కమ్మని చైత్రము సాగిపోవ సీ
తాలత పూలు రాల్చు చలి కాలము వచ్చెను చూడుడిప్పుడే

శివుడత్యంత సుఖంబుగా హిమమునన్ శ్రీగౌరి జోకొట్టగా
పవళించెన్, మరి రామచందురుని పాపంబేమిటో గాని, లో
కువ గట్టెన్ సురముఖ్యుడే, శివుడు నాకానందమౌ సీతనున్,
జవరాలన్ కరుణించి ఇచ్చుటిక నా జన్మాన రాతున్నదా?

కలయేమో ఇది? నీదు మాటలవి నా కర్ణంబులన్ వాలెనే,
కలతే నాకిక ఆ కలాగి , నిజమే కన్నీరు మున్నీరుగా
ఇల నాకున్ ఎదురైననప్పుడిక నాకీ బాధ చల్లారునా?
కలనే కాలము చెల్లిపోవుటది నాకా మంచి రాతున్నదా?

దురదృష్టంబను కారు చీకటలమే, ధైర్యంబు లేకుండెనే,
కరముల్ పాదములన్నియున్ వణకెనే, కన్నీరు వాగయ్యెనే ,
ఎరుగన్ కారణమెందుకీ కలత, నేనే పాపముల్ చేసె, నా
తరమానోర్వగ , నా కథందునిక, బాధే తీరు రాతున్నదా?

దంతంబుల్ బహు లాగుచున్నవి, మహా తాపంబు పోటెత్తెనే,
పంతం బూనిటు లేగుచుంటి నెచటన్ పోవంగ కానున్నదే,
చెంతం గన్పడనట్టి సీత కొరకున్ చిత్తంబులో క్రాగు చున్,
ఎంతంతోతిల భార మున్నదిది తగ్గేటట్టు రాతున్నదా?

ఉపవాసంబులె పంచభక్ష్యములహో.. ఉత్కృష్ట దుఃఖంబులే
తపనల్ దీర్చెడు రాగ మాలికలు గీతాలాపనల్ చూడుడీ,
అపకారంబది చేయలేదునెపుడున్, ఆనందమే పంచితిన్,
కృపచూపించడె దైవమీ వ్యథలు నాకున్ తప్పు రాతున్నదా?

ఆకాశంబును కూల్చగా వలయునో ? ఆవర్తనున్ చుట్టనో?
కీకారణ్యము కాల్చివేయు అనలున్ కన్నీట ముంచెత్తనో?
శోకాగ్నిన్ వరుణున్ దహింపవలెనో? శోషింపనో ధాత్రినిన్?
ఏకాకిన్, జగతిన్ జయింపవలెనో? ఏనేలగా సీతనున్.

నా సీతామహలక్ష్మినిన్ విమల దివ్యాక్షద్వయా శోభితన్
చూసేదెప్పుడు కన్నులార మిథిలా చిన్నారినిన్ జానకిన్
ఆ సీతన్ గని నాదు బాధ తొలగన్ ఆనందముప్పొంగగన్
హా సీతా! అని నేను ఏడ్చుటది ఆగాలన్న రాతున్నదా?

1సీతను చూచుచున్న దివిసీమల తేలెడి మానసంబుతో
వాతము తాకినట్లు తనువంతయు నిండెడి తన్మయంబులో
గీతము పాడుచూ మనసు గంతులు వేయగ గౌతమీనదీ
వింతను చూడ, రాముడిక వీడడు జానకి చీరకొంగునే.

2ఆకలి నీకు లేదనిక, ఆగ్రహమూ ఉపవాసముండునా?
వేకువ నుండి రాత్రివరకేమి విరామము నియ్య జాలవా?
నీకిది భావ్యమా ఇటుల నీవిపుడన్నము మానివేయగా
నాకును ఆకలుండదిక నాప్రియ సుందరి! అల్క మానవే

3నిను గనినంత నాక్షణమునే మటుమాయము నాదు బాధలే,
నను గనవేమి? నాయెడల నెందులకా అలుకేమి చేయుటో?
విను మిది నువ్వు చెప్పినదె వేదము, నీ కర మేది గీయునో
విను మదె గీత, దాటనుగ, వేదన బాపుచు మాటలాడుమా!

వనవాసమందు రామ విభుని నీడ
స్వర్ణలంకను కాల్చె సాధ్వి లలామ ①
అమవాస్య దాటిన అపరంజి భామ
శుక్లపక్షపు చంద్ర జాజ్వల్య దీప ②
తన గుణంబుల తోడ తనవారి కెల్ల
సత్కీర్తి తెచ్చిన సాకేత రత్న ③
జనక రాజేంద్రుని జన్మ సార్థకము
దశరథ రాజుకు తన వంశ కీర్తి④
శ్రీ రామచంద్రుని సగభాగమైన
మాన్యచరిత సీత మహలక్ష్మి సీత ⑤
ఆ సీత తోడుగా అనుజుని తోడ
విచ్చేసె రాముడు వాల్మీకి కడకు ⑥
పదునాల్గు ఏడుల పూర్వపు కథలు
వాల్మీకి మదిలోన వాగయ్యె నపుడు ⑦

అశ్వమేధము చేసి అమలుడైన పిదప
పుత్రకామేష్టి వల్ల పొందినట్టి
సాకేత నగరము సంతోషమొందగా
సకల విద్యలయందు శూరులైన
ప్రాణ సమానులౌ పుత్రుల యందున
పెద్ద వాడిని గాధి పుత్రుడడుగ
శ్రీ వశిష్టుడు చెప్ప శ్రీరామ చంద్రుని
దారుణాటవి కంపె దశరథుండు ⑧

అండ దండ గాగ అన్నకు తమ్ముడు
లక్ష్మణుండు సుగుణ లక్షితుండు,
తీర మడగకుండ ధీర విశ్వామిత్ర
బాట నడిచె రామ బాలకుండు. ⑨

నాద నందనం Naada Nandanam

పల్లవివిమల పినాకిని వీచిక
అమలజ భాసల హారిక

చరణం 1శైలమె శేషుడు శైలమె తల్పము
అలరెడు రంగని అంగణము
పిలువగ పలుకును పిల్లన గ్రోవది
చాలద గీతా సారము
॥ విమల ॥

చరణం 2వెన్నను మరిగిన వెన్నుని జిహ్వకు
తిన్నగ గారెలు తినుటకును
పెన్నను తెచ్చెను బెరుకుగ భూసతి
పన్నగ శయనుని పాటుకు
॥ విమల ॥

చరణం 3యవ్వన కాంతల హాసల భాసల
దివ్వెల మధ్యన తిరుగుచును
పువ్వులు చల్లగ మురిపెమునింతులు
నవ్వుచు రంగడు నాడెను
॥ విమల ॥

చరణం 4నాగేశానిల నాద వినోదము
వాగీశాచ్యుత వరముగను
రాగాలాపన రక్తిగ చేయరె
వేగమె చూడుడి వెన్నుని
॥ విమల ॥

Meaning

Pallavi — A ripple of the clear Penna river — pure-born, glowing, captivating.

Charanam 1 — The hill itself is Shesha, the hill itself is his bed — this is Ranganatha's blooming courtyard. Call out to him, and it is the flute that answers — and that sound alone is the essence of the Gita. Is that not enough?

Charanam 2 — For Vishnu's tongue, long used to stolen butter, eating spicy garelu straight is no easy thing — so Mother Earth, all flustered, brought the Penna river itself, for the trouble of the one who rests on the serpent.

Charanam 3 — The radiant smiles of the young women are themselves the lamps he moves among — as they scatter flowers in delight, Ranga dances, laughing.

Charanam 4 — Take the play of music of the wind that is Nagesha — hold it, for yourselves, as the unfailing boon of the Lord of the Word — sing the rāga with full feeling — and quickly, behold Vishnu!

పల్లవి 1 (సత్యభామ)ఏల వచ్చితివయ్య శ్రీ జగన్నాథుడా? ఈ దారి జ్ఞప్తికిని గలదటయ్య?
కోలాహలంబంత గడచిపోవగ నీవు కోమలాంగిని జూడ కదిలినావ?
కృష్ణయ్య! కృష్ణయ్య!

పల్లవి 2 (కృష్ణ)ప్రియురాల! మనసంత నీతలపె నిండెనే, ప్రియముగను కౌగిటను చేరనివ్వె,
అయుతముగ ప్రేమించు నిజనాథు వంకిటుల అలుగుటది న్యాయమా సత్యభామ!
ప్రియురాల! అలుకేల

చరణం 1 (సత్యభామ)నియతి తప్పితివయ్య నమ్ముమో శ్రీకృష్ణ! నిజసతిని విడనాడి వెడలినపుడు
నయనద్వయంబులో నీ రథమె నిండగా నగరవాసులు నన్ను మరచిరయ్య!
కృష్ణయ్య! కృష్ణయ్య! (1)

చరణం 2 (సత్యభామ)ఫలహారములు పెట్ట గోపకాంతలు నీకు భామగలదన్నదే మరచినావు
బలదేవు తోడ మీ చెల్లి తోడను నీవు బంగారు రథముపై తిరిగినావు
కృష్ణయ్య! కృష్ణయ్య! (2)

చరణం 3 (కృష్ణ)ఒక్కదానవె నీవు శోభింతువెప్పుడూ, ఒరులు నీ ప్రక్కగా మెరువగలరె?
ఎక్కిరా రథము మును అన్నయూ చెల్లియూ, ఎక్కనా రథము నిను పిలువగలనె?
ప్రియురాల! అలుకేల (3)

చరణం 4 (సత్యభామ)తాళ ధ్వజంబింక దర్పదలనంబింక తమరికా గరుడ ధ్వజంబుగాగ
కేళి సలుపగ జనులు మూడు రథములపైన, కిమ్మనక తమరచట కదలలేదె?
కృష్ణయ్య! కృష్ణయ్య! (4)

చరణం 5 (కృష్ణ)శ్రీక్షేత్రమొక్కటే రథయాత్ర చేయునా? శ్రీనాథుడంతటా గలడె భామ!
ఆక్షేపములు మాని వీక్షించి భక్తులను అలుక మానవె భామ! సత్యభామ!
ప్రియురాల! అలుకేల (5)

చరణం 6 (కృష్ణ)అడుగ గలమా భామ! రథ సంఖ్య భక్తులను? అచటొక్క రథమున్న నెక్కవలయు,
కడు వేడుకగ వారు చేయు యాత్రను జూచి కరుణజూపుము భామ! సత్యభామ!
ప్రియురాల! అలుకేల (6)

చరణం 7 (సత్యభామ)దామమో ఆ యతుల చేలమో మాలయో దామోదరా నీవు అవగరాదె
అమరియుందువు గాదె వారి గుప్పిళ్లలో అందముగ, భక్తి యదె అబ్జనాభ!
కృష్ణయ్య! కృష్ణయ్య! (7)

చరణం 8 (సత్యభామ)మనసు నిను పట్టునో పట్టదో గోపాల, మంచిగా పట్టుదురు వస్తువులను
తినగ ప్రసాదంబు తనువు మరచెదరయ్య తీపేమొ నీకన్న తెలుసుకోవె?
కృష్ణయ్య! కృష్ణయ్య! (8)

చరణం 9 (కృష్ణ)దామమందేడపుడు అడుగు వేసేడపుడు దర్శించునపుడారగించునపుడు
కోమలాంగీ నన్ను జైజగన్నాథయని కోరి పిలుచుదురమ్మ చూడవమ్మ
ప్రియురాల! అలుకేల (9)

చరణం 10 (కృష్ణ)లోక మాతవు గాదె? భూయంశ గావటే? లోన ఓర్పుంచవే ఊరుకోవె
సుకుమారవతి నీకు తగదె కోపము చూడు సుతులెల్ల కంపింతురాలకించు
ప్రియురాల! అలుకేల (10)

చరణం 11 (కృష్ణ)నీకతుల ప్రీతియని పూత రేకులు తేవ నీ నాథుడేగెనిక చల్లబడవె
మకుటంబె చిరునవ్వు నీ వదన శోభలకు మన్నించి నన్నింక ఏలుకోవె
ప్రియురాల! అలుకేల (11)

చరణం 12 (సత్యభామ)మాట కారివి గాదె మాయ గోపాలుడా! మదన మోహన! కృష్ణ! సత్యాపతి!
ఇట రమ్ము పెట్టెదను చేతులారగ నీకు ఇష్టమౌ పూతరేకులను నాథ!
కృష్ణయ్య! కృష్ణయ్య! (12)

చరణం 13 (సత్యభామ)ఎచటకేగిన గాని వదిలి పోకుము నన్ను, ఎగతాళి కాదయ్య ప్రేమకపుడు?
అచలమందున్న ఆ నాగేశు సాక్షిగను హంసగమనుని సాక్షి మాట ఇమ్ము
కృష్ణయ్య! కృష్ణయ్య! (13)

చరణం 14 (కృష్ణ)రెండు రూపములైననొక్క ఆత్మగ మనము రెండు పేర్లైననొక భావముగను
నిండుగా వెలిగెదము ఎల్ల వేళల మనము నిజమిదియె నిశ్చయము నన్ను నమ్ము
ప్రియురాల! ప్రియురాల! (14)

పల్లవి (శివుడు)రమణీ! నీ సుతుకై షణ్ముఖుకై గుహుకై రారే కట్టుమలై సుజ్ఞానంబునకై
హిమజా! గరువంబే మది కమ్మే అరెరే! యింపుగ తను వివరింపగ ఓంకారమునే
॥ స్వామినాథుడతడే స్వామినాథుడతడే ॥

చరణం 1యుగములు తపమొనరించెడి ఋషులకునైనన్ యోగులు దేవేంద్రుడు వాణీశునకైనన్
జగమున గల వారల యందొక్కరికైనన్ శక్యమె ఈ రీతిగ ఓంకారము తెలుపన్
॥ స్వామినాథుడతడే స్వామినాథుడతడే ॥ (1)

చరణం 2తిలకింపుము, తండ్రులు తమ తనయల తోడన్ దేవీ! ఆ అరువది మెట్లారోహింపన్
విలసిల్లెడి మన సుతునా మురుగని గొలువన్ వేడుక వేరుండునె మరి మా మదికింకన్
॥ స్వామినాథుడతడే స్వామినాథుడతడే ॥ (2)

చరణం 3కలదదుగో నాగేంద్రంబతి వినయముగన్ కలరవమే శివగురుడని ఆరాధింపన్
కలగందురు కద తండ్రులు ఈ ధన్యతకున్ కనుటకు తమ సంతానము నో శిఖరమునన్

Meaning

Pallavi — O lovely one! For your son's sake — for Shanmukha's sake, for Guha's sake — don't they come to Kattumalai, for the sake of true wisdom? O daughter of the mountain! Doesn't pride fill my heart, alas, at how charmingly he explains the Omkāra itself! — He is Swaminatha, he is Swaminatha.

Charanam 1 — Even to sages performing tapas across the yugas, even to yogis, to Devendra, to Vāṇīśa — among all who exist in this world, is even a single one of them capable of explaining the Omkāra in this way? — He is Swaminatha, he is Swaminatha.

Charanam 2 — O Goddess, behold — as fathers ascend those sixty steps together with their daughters — to worship our own splendorous son, Muruga — what other delight could remain in our minds beyond this? — He is Swaminatha, he is Swaminatha.

Charanam 3 — Doesn't even the great elephant, so humbly, amid the tumult, worship him, calling him Śivaguru! Don't fathers dream, isn't it so, of this very blessedness — of seeing their own children reach some peak!

పల్లవిరాయగలనా రామ! రాగయుక్తముగానూ?
ఛాయ నీవై నాకు సాయంబు సేయుమయ్య!

చరణం 1శ్యామ కృష్ణాయంచు సామవేదామృతమును
రామ! రామా! నేను రాగావళులు గట్టిక
॥ రాయగలనా రామ! ॥ (1)

చరణం 2త్యాగరాజాప్తుడుగ దశరథాత్మజ! రామా!
వేగ సేయుము నన్ను వేడుకొందును రామా!
॥ రాయగలనా రామ! ॥ (2)

చరణం 3గురుగుహ మనన తపో కులభాను పద పంకజ
సారము గళము జార సాకేత సార్వభౌమ!
॥ రాయగలనా రామ! ॥ (3)

చరణం 4భావయుక్తము గాను పారు కన్నీరుతోను
గావమంచును పాడ గలన కోదండ రామ!
॥ రాయగలనా రామ! ॥ (4)

చరణం 5ఏడిపించకు రామ! ఎగతాళి సేయకయ్య!
గాడినందున పెట్టి గానంబు జక్కదిద్దు
॥ రాయగలనా రామ! ॥ (5)

చరణం 6రామ! నాగేశ నుత! రాగాలు నేర్పకుండ
నామ మాత్రము నీవు నను పట్టి వీడిపోవ
॥ రాయగలనా రామ! ॥ (6)

Meaning

Pallavi — Can I write, O Rama — with rāga in it? Be my shadow, and grant me your help.

Charanam 1 — Saying "Śyāma Kṛṣṇa" — could I write the nectar of the Sāma Veda by constructing rows of rāgas, O Rama, Rama?

Charanam 2 — O son of Daśaratha, Rama! — make me swiftly one of the tyāgarājāptulu. I beg you, Rama.

Charanam 3 — O sovereign of Sāketa! — let the essence of the lotus-feet of the sun of that lineage, whose tapas was the contemplation of Guruguha, slip down into my throat.

Charanam 4 — With bhāva in it, with tears streaming — can I sing, crying "protect me," O Kodanda Rama?

Charanam 5 — Don't make me weep, Rama! Don't mock me! Put me on the track and set my singing right.

Charanam 6 — O Rama, Nāgeśa-nuta — praised by Lord Śiva! — without teaching me the rāgas, that you should hold me as a namesake alone and let me go —

Context

The first three charanams invoke the Trinity of Carnatic music — Syama Sastri, Tyagaraja and Muthuswami Dikshitar — in order, each by his mudra (the signature a composer weaves into his own compositions) rather than by name.

Charanam 1 — శ్యామ కృష్ణ. Syama Sastri's mudra. The eldest of the Trinity, he composed some three hundred kritis, mostly to Goddess Kamakshi, and alone among the three gave exceptional attention to laya, using uncommon and intricate talas. He is invoked here beside the Sāma Veda, the sung Veda from which Indian music descends.

Charanam 2 — త్యాగరాజాప్తులు. The phrase is Tyagaraja's own, from the ninth charanam of Endaro Mahanubhavulu: those who grasp the inner meaning of the scriptures and know the joy of bhāva, rāga and laya together are the ones he calls his āptulu — his own people. This keertana distributes the same triad across itself: laya assumed, rāga asked for in the pallavi, bhāva in charanam 4.

Charanam 3 — గురుగుహ. Dikshitar, addressed only through his mudra. Unlike the Telugu compositions of the other two, his are predominantly in Sanskrit, contemplative and in slower chowka kāla; accordingly this charanam alone is written in dense Sanskrit compounds. Guruguha is also a name of Subrahmanya.

పల్లవిజట్టు చేరి నీ సాటివాడిగాను
పట్టనివ్వు నిను పాండురంగ విఠల!

చరణం 1నొసట జారు నీ కురులను సవరించి, నుదుట పింఛయుక్త మకుటంబునమర్చి
అసమ హాసధర! నీ చుబుకము పట్టి అందము హెచ్చింప తిలకంబు దిద్దగ
॥ జట్టు చేరి ॥ (1)

చరణం 2పట్టు వస్త్రములు ధరియింపగ జేసి బంగారు నగలను గళ భుజముల బెట్టి
కట్టగ నడుముకు ఉత్తరీయంబును కలుపుకోవె నన్ను పాండురంగ విఠల!
॥ జట్టు చేరి ॥ (2)

చరణం 3కర్ణముల మకర కుండలంబులనిక గళసీమ కౌస్తుభ తులసి మాలలనిడ
పర్ణవర్ణమణిహార! సుగుణధీర! పదయుగముల చోటు నివ్వవేమి విఠల!
॥ జట్టు చేరి ॥ (3)

చరణం 4ఆటలాడ నీ జట్టు చేరనిమ్ము అడ్డుచెప్పకయ్య పాండురంగ విఠల!
మాటమాటలో ముద్దులొలుకు మోము మది నిండగ జూడ చేరనిమ్ము విఠల!
॥ జట్టు చేరి ॥ (4)

చరణం 5భక్తి హీనతను కారణంబంచును బహు దూరము పెట్టి వెలివేయక విఠల!
నక్తచరనాశ నీ సఖుడిననుకొని నాగేంద్రనుత! నా సఖుడవ్వు విఠలా!
॥ జట్టు చేరి ॥ (5)

తుంగ తరంగం Tunga Tarangam

జో దేవదేవేరి ! జోజోలు నారీ!
లాలి జవరాలైన పడుచు వయ్యారీ!
జో జో జో జో

క్షీరజలధిన బుట్టి నెలవంక చెల్లి, శేషశయనుడు మేఘశ్యామునితో వెళ్లి
నల్ల బుగ్గలనెర్రపరచి మైమరచి, అలసి సొలసిన బుజ్జి బంగారు కూచి..
జో జో జో జో (1)

రామచంద్రుని వెంట అడవులకు వెళ్లి, కందె నీ పాదాలు ముళ్ళ బాటల మళ్ళి
ఒడిలోన పెట్టి ఆ పాదాలు మళ్ళీ, ఒత్తుతూ పాడాలి సీతకీ లాలి..
జో జో జో జో (2)

జగతి కోరెడి చక్రి నీ కొంగు పట్టి, విడువనంటున్నాడు తను ఒట్టు పెట్టి
మాయ గోపాలుడినె మాయలో పెట్టి, రప్పించుకున్నట్టి భీష్మకుని పట్టి..
జో జో జో జో (3)

నందనంబున పారిజాతంబు కోరే, సత్యభామాదేవి రణరంగమేగె
పూవు ముట్టెడి చేత ధనువునే పట్టి, వీర శృంగారముల కలయికయ్యెడి చిట్టి..
జో జో జో జో (4)

గడుసుమాటల విభుని గుండె దాగితివి, పతికి జోకొట్టతని మతిని దోచితివి
పొడవైన వాల్జడను తిప్పి అలసితివి, సొంపైన సొగసులను మోసి సొలసితివి..
జో జో జో జో (5)

జో నీలవేణి! జోజోలు శుభతరుణి!
లాలి మంజుల వాణి! పసిడి పారాణి!
జో జో జో జో

సృజన చేసే కవికీ స్ఫురణవైనావు, కర్త నీ పతి, అతని కార్యముల కలవు
భాష నీ పతియైతె భావమే నీవు, సరస సల్లాపాల సారస్వతమువు..
జో జో జో జో (6)

జో హరుని అర్థాంగి! జోజో లతాంగీ!
జోలాలి నాగేశ హృదయాంతరంగీ!
జో జో జో జో

తాపసిని నువుకోరి తపములనొనర్చి, మంచుకొండల వాని మదిని కరిగించి
కన్నులలిసేడట్టు నీ పతిని చూచి, గరళకంఠుని హృదయ తాపంబునణచే..
జో జో జో జో (7)

జగతికర్థముకాని జంగముని కోరి, తనువునిచ్చిన తల్లితండ్రులతో పోరి
భస్మమలదిన విభుని బాహువులజేరి, ముద్దుమురిపెములాడు మాంగళ్య గౌరి..
జో జో జో జో (8)

జోలాలి జోలాలి లాలినేననగా
జారుకో నిద్రలో మా గౌరిదుర్గ!
జో జో జో జో

అరుణోదయ విప్లవమని
అవనికెంతో అవసరమని
ఆర్తుల శోక ధ్వని విని
అరిచా లాల్ సలాం అని

కులం గోడ కూల్చాలని
మతం మత్తు మాన్పాలని
చీకటి తెర చీల్చాలని
అరిచా లాల్ సలాం అని

సమ న్యాయం మన హక్కని
సమసమాజ స్థాపనకని
సామ్యవాద కలలే కని
అరిచా లాల్ సలాం అని

అవినీతిని ఆపాలని
బాధ్యతనే నేర్పాలని
ప్రగతి బాట పట్టాలని
అరిచా లాల్ సలాం అని

అజ్ఞానము మాయమైన
పలు విద్యల వెలుగులోన
ప్రపంచాన్ని చూడాలని
అరిచా లాల్ సలాం అని

రాక్షస పాలన వద్దని
స్వార్థపు వ్యక్తులు చేటని
త్యాగధ్వజమెగరాలని
అరిచా లాల్ సలాం అని

పౌరుషంతో ఉరకలేసే
నా రక్తము చిందించి
లోకాన్నే కడగాలని
అరిచా లాల్ సలాం అని

మనిషికంటు విలువుందని
విలువలతో బతకాలని
మనిషికి మనిషే దిక్కని
అరిచా లాల్ సలాం అని

అస్తమించు సూర్యునిగని
ఏదీ ఆ మార్పేదని
ఇంకెప్పుడు వస్తుందని
అరిచా లాల్ సలాం అని

పగటికి రేయికి రోజని
ముప్పై రోజులు నెలకని
గడిచే ఏళ్లని కని కని
అరిచా లాల్ సలాం అని

కుడి ఎడమల తడబాటున
సాగే మనుషుల కథ గని
జగమంతా నాటకమని
అరిచా లాల్ సలాం అని

సిద్ధాంతం పునాదిగా – రాద్దాంతం లేచిందని
పక్షపాత ధోరణిలో - నిజం దాగిపోయిందని
అధికారపు దాహంలో - పోరు మాయమయ్యిందని
నాయకుడేగుంపైనా - న్యాయం జరగట్లేదని
సామాన్యునికివి ఏవీ - సమస్యలుగ కనబడవని
పల్లీ ముచ్చట్లుగ మన ఉద్యమాలు మిగిలాయని
గత చరిత్ర నేర్పించిన - గుణపాఠం మరిచామని
ప్రతిరోజూ దెబ్బతినే అలవాటే మనకుందని
స్వార్థపు సంకెళ్లే మన – చేతులకాభరణాలని
పిరికితనం బద్ధకమే - మన కాళ్ళకు చెప్పులనీ
ప్రగతివాక్య శ్రవణానికి - చెవులను మూసేసామని
నీతివాక్య పఠనానికి – వాక్కును వాడట్లేదని
న్యాయమైన విచారణకు - బుద్ధిని ఉపయోగించని
చదువుకున్న మూర్ఖులమని - పట్టాలున్న పామరులని
నిజం కనే దమ్ములేని – మన బతుకులు వ్యర్థమనీ
మంచి చేయ మనసు రాని - ప్రాణమున్న రాళ్ళమని

నా అరుపులు వ్యర్థమనీ
నా వేదన పట్టదనీ
మన బతుకులు మారవనీ
తెలిసే నే పూనుకుని
అరిచా లాల్ సలాం అని
అరిచా లాల్ సలాం అని

सारे जहाँ से सीखो, भारत वीर कुमारा / कुमारी
सारे जहाँ से सीखो,
हम सब का घर है धरती
कौन है भला कहने को - 'ये मेरा'? ॥ सारे जहाँ ॥

क्या फायदा हमें? बोलो, मजहब के नाम पे लड़ना
कर्म भावन अलग भी, धर्म सार तो एक है हमारा ①

ग्रंथ वाक्य बदलते हैं - धर्म तो निश्चल यारा
हम पासबाँ हैं इसकी, वो पासबाँ हमारा हमारा ②

ज्ञानी राजा राममोहनजी, ब्रह्मो समाज विचारा
दैवकुमार वचन से - प्रेम त्याग मिले जीवन सारा ③

अष्टांग मार्ग सीखो, यीवू वचन है पूरा
दारा शुकोह का रास्ता ढूंढो, चलना अवश्य काम है हमारा ④

मजहब नही सिखाता, आपस में बैर रखना
इंसान हैं हम, इंसान हैं हम, इंसान हैं हम
बरसते प्रेम से भरा विचार हमारा ⑤

सारे जहाँ से सीखो - भारत वीर कुमारा !

हर दिन, ख्वाहिश है मेरी,
पहुँचना तो मंजिल तेरी.

हर सपना तुझे बुलाना,
हर सपना टूट गया, ना?

हर पल तुम याद में आना,
कब रुकेगा मेरा रोना?

सच कहता हूं, मेरे जाना!
मेरा जीवन तू, मेरी सोना!

मेरे हाथ से तुझे पकड़ना,
तेरी हंसी को देखते रहना,

सिया! तुम मेरी बात को सुनलो,
राम के दिल को, तुम खुश करलो,

हर दिन, ख्वाहिश है मेरी,
पहुँचना तो मंजिल तेरी...